ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నడిసంద్రపు నౌకల్లో అంతర్జాలం.. పల్లెటూరి యువకుడి ప్రతిభతో సాధ్యం - మెరైన్​ ఇంజినీరింగ్​ చిత్తూరు యువకుడి సత్తా కథనం

సాధించాలన్న తపన ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సులువుగా ఛేదించవచ్చని... పట్టుదల ముందు పేదరికం ఏ మాత్రం అడ్డురాదని నిరూపిస్తున్నాడు.. ఓ పల్లెటూరు యువకుడు. మెరైన్ ఇంజినీరింగ్​లో ఐటీని మేళవించి... అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అత్యాధునిక సాంకేతికతను నేర్పుగా అందిపుచ్చుకుంటూ... అరుదైన రంగంలో తెలుగోడి సత్తాను ఘనంగా చాటుతున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్ రాజు.

నడిసంద్రపు నౌకల్లో అంతర్జాలం.. పల్లెటూరి యువకుడి ప్రతిభతో సాధ్యం
నడిసంద్రపు నౌకల్లో అంతర్జాలం.. పల్లెటూరి యువకుడి ప్రతిభతో సాధ్యం

By

Published : Jun 23, 2020, 8:39 PM IST

మెరైన్​ ఇంజినీరింగ్​లో సత్తా చాటుతోన్న పల్లెటూరి యువకుడు
చిత్తూరు జిల్లాలోని సీఆర్ కండ్రిగ అనే మారుమూల గ్రామానికి చెందిన మోహన్ చిన్నప్పటి నుంచి ఇంజినీర్ అవ్వాలని కలలుకనేవాడు. అతడి తండ్రి చిన్న రైతు. పేదరికం వెంటాడినా... చదువులో మాత్రం ఎప్పుడూ ముందుడేవాడు మోహన్. ఇంటర్ తర్వాత చైన్నైలోని ఐఎస్​బీఎంలో ఇంజినీరింగ్ సీటు సంపాదించాడు. అందరికంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో మెరైన్ ఇంజీనీరింగ్​ను ఎన్నుకున్నాడు. ఈ రంగంలో గొప్ప స్థాయికి ఎదిగిన తొలి తెలుగు కుర్రాడిగా నిలిచాడు.

సాంకేతికత అందిపుచ్చుకుంటూ..

ఇంజినీరింగ్ అనంతరం చైన్నైలోనే ఓ షిప్పింగ్ కంపెనీలో మోహన్​ ఎక్సిక్యూటివ్​గా చేరాడు. అప్పుడే తన ఆలోచనలకు పదును పెట్టాడు. మెరైన్ ఇంజినీరింగ్ అంతా యంత్రాలచుట్టూనే తిరుగుతుంది తప్ప... అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటం లేదని గ్రహించిన మోహన్ ఆ దిశగా అధ్యయనం సాగించి విజయం సాధించాడు. మెరైన్ ఇంజినీరింగ్​కు ఐటీ సాంకేతికతను జోడించాలనే ఆలోచనతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కస్టమర్ సర్వీసెస్​లో ఎంబీఏను పూర్తి చేశాడు. డెన్మార్క్ ప్రధాన కార్యాలయంగా ముంబైలో సేవలిందిస్తోన్న అల్ట్రాషిప్ అనే విదేశీ షిప్పింగ్ కంపెనీ మోహన్​కు తమ బృందంలో అవకాశమివ్వటంతో అతడి జీవితం మలుపు తిరిగింది. నేవిగేషనల్ సాఫ్ట్​వేర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, మెరైన్ ఈఆర్పీ, మెరైన్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరీటీలతో పాటు... నౌకల్లో అంతర్జాతీయ సదుపాయాలను ఏర్పాటు చేసేలా ఓ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. డెన్మార్క్​లో మెరైన్ ఐటీ హెడ్​గా ఉన్నత ఉద్యోగం సంపాదించాడు.

నడిసంద్రం నుంచి సమాచారం అందేలా

ఆల్ట్రాషిప్ కంపెనీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 భారీ నౌకల్లో తన ప్రాజెక్ట్​ను ప్రవేశపెట్టేందుకు అనుమతులు పొందాడు మోహన్. నౌక నడి సంద్రంలోకి వెళ్లాక... అందులో ఉన్న మనుషులు భూమిపై ఉన్న వాళ్లతో సమాచార ప్రసారం జరపాలన్నా... తర్వాత వచ్చే పోర్టులో నౌకకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేయాలన్నా అంతకు ముందు వీలయ్యేది కాదు. ఆయా దేశాలకు చెందిన రక్షణ వ్యవస్థల్లో మాత్రమే ఈ సాంకేతికత ఉండేది. ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలకూ వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మోహన్... తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు.

నాలుగేళ్లలో 35 దేశాల్లో

ఉపగ్రహాల సాయంతో... భారీ నౌకల్లో ప్రత్యేక ఏంటెన్నా సదుపాయాలను ఏర్పాటు చేసి... ఎంత నడి సముద్రంలో ఉన్నా శాటిలైట్​తో అనుక్షణం అనుసంధానమై ఉండేలా రూపొందిన ప్రాజెక్ట్​లోనూ మోహన్ కీలకపాత్ర పోషించాడు. కేవలం నాలుగేళ్లలోనే 35 దేశాల్లో మెరైన్ ఇంజనీర్​గా సేవలందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, డెన్మార్క్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, అమెరికా ఇలా ప్రముఖ ప్రపంచదేశాల్లో పనిచేసిన అనుభవం మోహన్ సొంతం. నెలకు ఆరువేల జీతంతో ప్రారంభమైన అతడి జీవితం.. ఇప్పుడు లక్షలు సంపాదించే స్థాయికి చేరుకుంది.

ప్రైవేటు నౌకల్లోనూ అంతర్జాల సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అందులో పనిచేసే ఉద్యోగుల్లో... తమ కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతున్నామన్న బాధను తీర్చగలగడమే తనకు ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నాడు మోహన్. మెరైన్ ఇంజినీరింగ్ రంగంలోకి ప్రవేశిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటూ ప్రోత్సహిస్తున్నాడు.

ఇదీ చూడండి..

పేదరికంతో ఉన్నతంగా.. సీఏ చదువుతో సేవే మార్గంగా..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details