రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
శరన్నవరాత్రుల ముగింపు విజయదశమి పర్వదినాన పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆధ్యాత్మిక శోభను పరిమళింప చేస్తున్నాయి. పాలంగిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేటితో ఉత్సవాలు ముగియనున్నాయి. విజయదశమి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తణుకు పట్టణంలోని కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారం దర్శనమిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరిగా పూజలందుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దువ్వలో కొలువైన శ్రీ దానేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విజయదశమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆలయాల వద్ద కుంకుమ పూజలు చేశారు. అమలాపురం మొదలుకొని కోనసీమ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలలో భక్తులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.