పోలవరం ప్రాజెక్టు పై అధికారుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుపై నేడు అధికారులు సమావేశం కానున్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ నేడు విజయవాడలో సమావేశం కానుంది. ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ అంశాలే అజెండాగా సమావేశం జరగనుంది. పోలవరానికి ఎంత వరద రాబోతుందో అంచనా వేసే వ్యవస్థ ఏర్పాటుపై అథారిటీ చర్చించనుంది. అలాగే కేంద్రం నుంచి నిధుల విడుదల అంశాన్ని అథారిటీ సమీక్షిస్తుంది. భూసేకరణ, పునరావాసం ఎంతవరకు వచ్చిందో పరిశీలించనుంది. ఒడిశా, చత్తీస్‌గడ్ భూసేకరణ అంశాలపైనా దృష్టి సారిస్తుంది. శుక్రవారం ప్రాజెక్టు అథారిటీ స్వయంగా పోలవరం వెళ్లి పనుల పురోగతిని చూడనుంది. ఇవాళ్టి సమావేశానికి డ్యాం డిజైన్ కమిటీ ఛైర్మన్ పాండ్యా, కేంద్ర జలసంఘం సభ్యుడు హల్దర్, ప్రాజెక్టుల కమిషనర్ ఓరా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. ప్రాజెక్టు అథారిటీ సీఈఓ జైన్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు పాల్గొంటారు.