ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 6:04 AM IST

Updated : Nov 30, 2020, 6:10 AM IST

ETV Bharat / city

కమణీయం...కార్తిక దీపం

రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమిని భక్తులు వైభవంగా జరుపుకున్నారు. శైవ క్షేత్రాల్లో శివునికి అభిషేకాలు చేసి... ప్రముఖ ఆలయాల్లో జ్వాలతోరణాలు వెలిగించారు. నదీ, సముద్ర తీరాల్లో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు, సామూహిక దీపారాధనలతో ప్రత్యేక పూజలు చేశారు.

కమణీయం...కార్తిక దీపం
కమణీయం...కార్తిక దీపం

కమణీయం...కార్తిక దీపం

కార్తిక పౌర్ణమి సందర్భంగా శివకేశవుల ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో స్వామివారికి ఏకాంతంగా చొక్కాని ఉత్సవం నిర్వహించారు. నంది వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి అధిరోహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వెలిగించిన దీపాలు ఊరేగింపుగా తీసుకొచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.

కృష్ణా జిల్లాలో

విజయవాడ ఇంద్రకీలాద్రి కోటిదీప కాంతులతో ప్రకాశించింది. మల్లికార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్ మాడవీధుల వరకూ ఆవునెయ్యితో భక్తులు దీపాలు వెలిగించారు. జ్వాలా తోరణాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కృష్ణా జిల్లా హంసలదీవిలో భక్తులు స్నానాలు చేసి తెప్పలు వదిలారు. మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర ఆలయంలో ధ్వజస్థంభం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు. కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. నూజివీడులోని శివాలయాలు విద్యుత్‌, కార్తిక దీపాల అలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి.

జ్వాలా తోరణం

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో కోటిదీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కోటిదీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని గ్రామాల్లో రైతుల దీక్ష శిబిరాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో

రాజమహేంద్రవరంలోని గోదావరి తీరం కార్తిక పౌర్ణమి శోభతో నిండింది. గోదావరి హారతి ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా... ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాలు చూసేందుకు భక్తులు తరలివచ్చారు. పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న మహా శివ లింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పంతం సత్యనారాణయ ఛారిటబుల్ ట్రస్ట్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం సంయుక్త ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళలో కొలువైన భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో వరిదుబ్బులతో చేసిన జ్వాలాతోరణం కింద భక్తులు ప్రదక్షిణలు చేశారు. అన్నవరంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఉన్న పల్లకీని జ్వాలాతోరణం కింద మూడుసార్లు ఊరేగించారు. అనపర్తిలోని శివకేశవ ఆలయాలు భక్తులతో నిండగా... వైష్ణవాలయాల్లో వైకుంఠ చతుర్దశి వేడుకలు వైభవంగా జరిగాయి. కోనసీమలోని పలు ఆలయాల్లో నూతన దంపతులు సౌభాగ్య వాయినాలు అందించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని రామేశ్వర స్వామి సన్నిధిలో అఖండ జ్యోతి ప్రజ్వలన వైభవంగా జరిగింది. జ్యోతిలో నెయ్యి వేసేందుకు భక్తులు బారులు తీరారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలోని మేధా దక్షిణామూర్తి ఆలయంలో లక్షపత్రి పూజ చేశారు.

ఇతర జిల్లాల్లో

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఒత్తులు వెలిగించి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురంలోని కాశీవిశ్వేశ్వర ఆలయంలో శివున్ని ప్రత్యేకంగా అలంకరించారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని ప్రముఖ ఆలయాలు కార్తీక దీపాల వెలుగులతో ప్రకాశించాయి. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో జ్వాలతోరణం, కోటి దీపోత్సవాలకు పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కార్తీక దీపోత్సవం, స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో... అష్టోత్తరాలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు నోములు నోచి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

ఇదీ చదవండి :రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద వైభవంగా లక్ష దీపోత్సవం

Last Updated : Nov 30, 2020, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details