ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - godavari flood news

భారీ వర్షాలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నదీ తీర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడి నుంచి దాదాపు 20.65 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద నీటిమట్టం 60 అడుగులకు చేరింది.

ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక

By

Published : Aug 17, 2020, 4:25 PM IST

Updated : Aug 17, 2020, 10:48 PM IST

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తోన్న వర్షాలకు వరద నీరు నదికి పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 18.80 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి దాదాపు 20.65 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

జలదిగ్బంధంలో గ్రామాలు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో గోదావరి వరద ఉద్ధృతికి.. దాదాపు 36 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దేవీపట్నం, పూడిపల్లి, పోచమ్మగండి, పొయ్యేరు, అగ్రహారం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్​, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొనసీమలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాదాపు 21 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్​.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏడేళ్ల తర్వాత మళ్లీ

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఏడేళ్ల తర్వాత నీటిమట్టం 60 అడుగులకు చేరింది. గోదావరి చరిత్రలో రెండుసార్లు నీటిమట్టం 70 అడుగులు దాటింది. 1986లో భద్రాచలం వద్ద గోదావరి అత్యధిక నీటిమట్టానికి చేరింది. 1976, 1983, 2006, 2013లో నీటిమట్టం 60 అడుగులు దాటింది.

కృష్ణాలో వరద ఉద్ధృతి

కృష్ణా పరీవాహకంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. 24 గంటల వ్యవధిలోనే శ్రీశైలం జలాశయానికి 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ పూర్తిగా నిండిపోగా... తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి.

ఇదీ చూడండి..

నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల

Last Updated : Aug 17, 2020, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details