పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ విధానం పూర్తిగా మారాలని డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ అధికారులకు సూచించింది. ఈ డ్యాం మరింత గట్టిగా, పటిష్ఠంగా ఉండాలంటే దీని నిర్మాణంలో సరైన మట్టిని వినియోగించాలని పేర్కొంది. మట్టి సేకరణ సమయంలో ఉన్న సాంద్రత, గట్టిదనం.. నిర్మాణంలో ఉపయోగించిన తర్వాత కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచించారు. రాజమహేంద్రవరంలో శనివారం పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ 16వ సమావేశం ఛైర్మన్ ఎ.బి. పాండ్య అధ్యక్షతన జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దిల్లీలోని మట్టి, ఇసుక పరిశోధన కేంద్రం నిపుణులు, పుణెలోని జల, విద్యుత్తు పరిశోధన కేంద్రం నిపుణులు సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై తమ అధ్యయనాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టులో వివిధ అంశాల్లో నాణ్యత, డిజైన్లపై చర్చించి ఈ కమిటీ సలహాలు ఇచ్చింది. ఇంతకుముందు సెప్టెంబరు 29న జరిగిన కమిటీ 15వ సమావేశంలో అనేక కీలకాంశాలు చర్చించి రెండు వరదల తర్వాత ఎగువ కాఫర్ డ్యాం గట్టిదనాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సంస్థ కాఫర్ డ్యాం వద్ద మట్టి నమూనాలు సేకరించి పరిశోధించి నివేదిక సమర్పించింది.
డ్యాం నిర్మాణంలో వినియోగించిన బంకమట్టి సాంద్రత నిర్మాణం తర్వాత మారిపోయిందని గుర్తించారు. ఇలాంటి రకం మట్టి వాడొద్దని, నిర్మాణం తర్వాత సామర్థ్యం మారని మట్టిని వినియోగించాలని కమిటీ సూచించింది. కాఫర్ డ్యాం నిర్మాణంలో చిప్స్ వాడే విధానం కూడా మార్చాలని కమిటీ పేర్కొంది. పెద్ద బండరాళ్లు తీసుకువచ్చి మిషన్ సాయంతో వాటి సైజు మార్చడం వల్ల నిర్దేశించిన ఆకృతిలో రావడం లేదని.. తొలుత 10 ఎంఎం, తర్వాత 20 ఎంఎం అలా పెంచితేనే కాఫర్ డ్యాం గట్టిదనం వస్తుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సీపేజీ సమస్యలు రాకుండా డ్యాం గట్టిగా ఉంటుందన్నారు.
- స్పిల్ వే లోని 8 బ్లాకుల్లో పియర్స్‌ను ఆనుకుని ఉండే ట్రునియన్ గడ్డర్లలో కొంత డ్యామేజిని గుర్తించారు. అక్కడ మార్చి 15లోగా కాంక్రీటు గ్రౌటింగు చేయాలని కమిటీ సూచించింది.
- స్పిల్ వే గ్యాలరీలోకి వరద సమయంలో నీరు రావడం వల్ల అక్కడ కేబుల్స్ కొన్ని పాడయ్యాయని గుర్తించారు. ప్లంబాంబు ఖాళీగా ఉండాలి. అందులోకి కాంక్రీటు వెళ్లిందని, అది సరిచేయాలని సూచించారు. ఇక్కడ నీటి స్థాయిని, ప్రవాహాలను లెక్కకట్టే పరికరాలు వాడతారు. అవి పాడయ్యాయి. వాటిని సరి చేయించాలని, లేదా కొత్తవి వినియోగించాలని సూచించారు.
- స్పిల్ ఛానల్, స్పిల్ వే ఎడమవైపు గైడ్ బండ్ వంటి వాటిపై అనేక సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో నిపుణులు డి.పి.భార్గవ, పీపీఏ చీఫ్ ఇంజినీర్ ఎ.కె.ప్రధాన్, పోలవరం ఎస్‌ఈ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.