నెల్లూరు సింహపురి ఆసుపత్రి ఘటనతో అవయవదానాల వ్యవహారం వివాదాస్పదమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవన్ దాన్ ద్వారా అవయవ మార్పిడి కోసం అనుమతులు పొందిన కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు... రాష్ట్రంలో 45 వరకూ ఉన్నాయి. ఒక్కో అవయవ మార్పిడికి తగినట్లు ఈ ఆసుపత్రులు జీవన్‌దాన్ నుంచి అనుమతులు పొందాయి.
వయస్సు, ఆరోగ్య పరిస్థితి, రక్తం, ఇతర పరీక్షలు, ఆర్థిక స్తోమత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవయావాల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవన్మృతుల వివరాలు అందిన వెంటనే అర్హులైన రోగుల ఎంపిక మూడో కంటికి తెలియకుండా అంతర్గతంగా జరిగిపోతోంది. ఏ ప్రాధాన్యాల ఆధారంగా రోగులను ఎంపిక చేశారో తెలియని పరిస్థితులున్నాయి. వైద్యపరమైన ఇలాంటి అంశాలను ఆసరాగా చేసుకుంటున్న పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు లబ్ధి పొందుతున్నాయి.
గుంటూరు జీజీహెచ్‌లో ప్రముఖ వైద్యులు ఎ.గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో గుండె మార్పిడి చికిత్సలు జరిగాయి. ఇటీవలే అవి నిలిచిపోగా... మళ్లీ మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా కిడ్నీ, లివర్ మార్పిడులు జరుగుతున్నాయి. తమిళనాడులో ఏడాదికి 350, తెలంగాణలో 250 మంది అవయవాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో ఈ సంఖ్య 30గానే ఉంది. వీరిలో అత్యధికులు పేదలే. ప్రస్తుతం రాష్ట్రంలో 1600 మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.