నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నెల్లూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా పట్టణాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. ప్రజల్లో ఎలాంటి భయాందోళన కనిపించడం లేదు. రోడ్లపై యథేచ్చగా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఒకే చోట పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. స్టోన్ హౌస్ పేట, పెద్దబజారు, చిన్నబజారులో వ్యాపారులు మాస్కులు ధరించకున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇదీ చదవండి:కోర్టులో ఏడుగురు జడ్జిలు సహా 44 మందికి కరోనా
అధికారుల చర్యలూ శూన్యమే...
కొవిడ్ బాధితులు సైతం రోడ్లపై తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సినిమా హాళ్లు కిక్కిరిసి పోయి ఉంటున్నాయి. రద్దీ ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రోజుకు వందల మంది రాకపోకలు సాగించే బస్టాండ్‌లు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ఎక్కడా అధికారులు శానిటైజింగ్ చేయించడం లేదు. జిల్లాలోని కావలి, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి పట్టణాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
"కరోనా నిబంధనలను ప్రజలు గాలికొదిలేశారు. అధికారులు సైతం కట్టడికి చర్యలు తీసుకోకపోవడంతో... కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలి" అని స్థానికులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఫ్లాట్‌కు తాళం!