కృష్ణా, కడప, నెల్లూరు జిల్లాల్లో మద్యం అక్రమరవాణా, నాటుసారా విక్రయాలు చేస్తున్న వారిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిపై కేసులు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో..
నందిగామ మండలం పల్లగిరి వద్ద వాహన తనిఖీల్లో 49 కేసుల(2352 మద్యం సీసాలు) తెలంగాణ మద్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు తెలంగాణలోని మడుపల్లి నుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కడప జిల్లాలో..
రైల్వేకోడూరు మండలంలోని నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీచక్రవర్తి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. మైసూర్వారిపల్లికి చెందిన వరికూరి కృష్ణయ్య వద్ద నుంచి 10 లీటర్లు... బాలిశెట్టి వెంకటయ్య నుంచి 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.