ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన' - nellore latest news

వరుస నష్టాలతో విలవిల్లాడుతున్న రైతులను ఆదుకొనేందుకు... మద్యం అమ్మకాలతో వచ్చిన ఆదాయాన్ని వెచ్చంచాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. పంట నష్టాల పరిశీలనకు నెల్లూరులో పర్యటిస్తున్న ఆయన... ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకుంటే... ఎల్లుండి అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

janasena chief pawan kalyan meeting in nellore
జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Dec 5, 2020, 10:41 AM IST

Updated : Dec 5, 2020, 12:07 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్

నివర్‌ తుపాను కారణంగా పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జనసేనాని గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులను పరామర్శించి వారి వివరాలు తెలుసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు భరోసా, మనోధైర్యం ఇవ్వడం కోసం వచ్చినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే మూడోసారి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్‌ తెలిపారు.పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ప్రజలకు మార్పు కావాలి

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమైందని పవన్‌ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు బలమైన సంకేతం పంపేలా చేసినట్లయిందన్నారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సమన్వయ కమిటీ వేస్తున్నట్లు పవన్‌ చెప్పారు. స్థానిక నాయకత్వం అభిప్రాయాలు తీసుకుని తిరుపతి ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'జనసేన అంటే ఎందుకంత భయం?'

Last Updated : Dec 5, 2020, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details