నెల్లూరు నగరపాలికలో నామినేషన్లు ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించారు. 8 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. నెల్లూరులో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.
మోగిన నగారా...
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు శంఖారావం మోగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ఖరారు కాగానే.. పత్రాల ముద్రణకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ యాప్ ద్వారా వారి ఓటు హక్కు ఏ కేంద్రంలో ఉందో తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఛైర్మన్ ఎస్టీ(జనరల్) కు ప్రభుత్వం కేటాయించింది.
వడివడిగా ఏర్పాట్లు...
నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఓ వైపు పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ పనులు వేగంగా చేపడుతున్నారు. కమిషనర్ దినేష్‌కుమార్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ఆయా పనుల పర్యవేక్షణకు రోజూ మూడు, నాలుగు గంటలు కేటాయిస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకం, కంప్యూటర్లు సమకూర్చుకునే పనులు ఊపందుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పట్టణ సామాజికాభివృద్ధి విభాగాన్ని ఓటరు చైతన్య కార్యక్రమాల్లో ఉపయోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రధానంగా మారిన నెల్లూరు నగరపాలక ఎన్నికలు...
నెల్లూరు కార్పొరేషన్ ప్రధానమైంది కావడంతో.. ముఖ్య నాయకులంతా నగరంపైనే దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మరింత ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరులో డివిజన్, వార్డు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. రిజర్వేషన్లు, సామాజిక సమీకరణల ఆధారంగా వైకాపా, తెదేపా ముఖ్య నాయకులు పార్టీ కోసం కష్టపి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. చాలా డివిజన్లలో వైకాపా అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఓట్లు అభ్యర్థించనున్నారు. మరోవైపు తెదేపా ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, బీసీ జనార్దన్‌రెడ్డిని నియమించింది. వీరితో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సమక్షంలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థులు 54 డివిజన్లలో పోటీకి దిగుతారని ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి ప్రకటించారు.
ఇవీచదవండి.