నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు దర్గామిట్టలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు మూసే ఉంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు, బియ్యం ఇస్తున్నారు. వీటి కోసం తల్లితండ్రులతో కలిసి విద్యార్థులు వస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా అనుమానితులు పాఠశాల ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థులు తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే గేటు నుంచి కొవిడ్ పరీక్షలకు వచ్చేవారు, విద్యార్థులు వస్తున్నారు. కొవిడ్ పరీక్షలకు వచ్చే వారిలో ఎంత మందికి కరోనా పాజిటివ్ ఉందో అర్థం కావడం లేదని, విద్యార్థులకు తెలియక వారితో కలిసి లోపలికి నడవడం, ఆటోల్లో కలిసి వస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.