ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్​ - ఏపీ తాజా వార్తలు

Nellore and Sangam barrages: సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్...ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తూ వస్తున్నామన్న సీఎం... నెల్లూరు జిల్లాలో కరవు మండలమంటూ ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

CM jagan
ముఖ్యమంత్రి జగన్‌

By

Published : Sep 6, 2022, 3:30 PM IST

Updated : Sep 7, 2022, 6:40 AM IST

సంగం బ్యారేజీ

Nellore and Sangam barrages: ‘లక్షల ఎకరాలకు నీరందించే సంగం, నెల్లూరు బ్యారేజీల్ని దాదాపు 140 ఏళ్ల కిందట బ్రిటిష్‌ హయాంలో నిర్మించారు. కాలక్రమంలో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. పట్టించుకోలేదు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే.. వీటికి మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీల పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఆయన మరణంతో ఆగిపోయిన పనుల్ని... తర్వాత వచ్చిన వారు పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తి చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా’ అని సీఎం జగన్‌ అన్నారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై సంగం దగ్గర నిర్మించిన ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’ని మేకపాటి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మంగళవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే కొవిడ్‌ సమస్య తలెత్తిందని, మరోవైపు పెన్నానదిలో వరుసగా రెండేళ్లు వరదలు వచ్చాయని, అయినా మూడేళ్లలోనే బ్యారేజీని పూర్తి చేశామన్నారు. సంగం, నెల్లూరు బ్యారేజీలకు వైకాపా ప్రభుత్వం రూ.320 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ రెండింటి ద్వారా సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. 2006లో సంగం బ్యారేజీ పనులను రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే... ఆయన కుమారుడిగా దానిని పూర్తి చేశానని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ బ్యారేజీలతో ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు.

వైకాపా ప్రభుత్వంలోనే...
గత ప్రభుత్వం సంగం బ్యారేజీకి రూ.30.05 కోట్లే ఖర్చు చేసిందని.. 2017 నాటికి పూర్తి చేస్తామని ఒకసారి, 2018 నాటికి అని మరోసారి చెప్పి ముహూర్తాలు పెట్టుకుంటూ.. వాటిని మార్చుకుంటూ పోయారని జగన్‌ విమర్శించారు. వారు చేసిందల్లా బ్యారేజీల్లో రేట్లు పెంచేయడం, ఎస్కలేషన్‌ ఇచ్చేయడం.. ఆ తర్వాత కమీషన్లు దండుకోవడమేనని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్నేహితుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో ఇచ్చిన మాట ప్రకారం... సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టుకున్నామని చెప్పారు.

రూ.147 కోట్ల అంచనా వ్యయంతో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నెల్లూరు బ్యారేజీని ప్రారంభించారని, అప్పట్లోనే రూ.86 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదన్నారు. జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ప్రతిపాదనల్లో కొన్నింటికి బహిరంగ సభ వేదికపైనే సీఎం ఆమోదం తెలిపారు. దాదాపు రూ.85 కోట్లు కేటాయించారు.

ప్రధానమైన సోమశిల హైలెవల్‌ కెనాల్‌, నారంపేట ఇండస్ట్రియల్‌ పార్క్‌పై ఎలాంటి ప్రస్తావనా చేయకపోవడం చర్చనీయాంశమైంది. అనంతరం ఆయన నెల్లూరు బ్యారేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆనం రామనారాయణరెడ్డి, వరప్రసాద్‌, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

.

సీఎం పర్యటన సాగిందిలా...
బ్యారేజీల్ని ప్రారంభించేందుకు సీఎం మంగళవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం 11.24కు సంగంలోని గురుకుల పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు. రోడ్డు మార్గంలో 2.5 కి.మీ.దూరంలోని సంగం బ్యారేజీ దగ్గరకు వెళ్లారు. జలపూజ అనంతరం పెన్నమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’ పైలాన్‌ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

అక్కడే ఏర్పాటు చేసిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం సంగం-కలిగిరి రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభావేదికకు 12.40కు చేరుకున్నారు. సభ పూర్తయ్యాక హెలికాప్టర్‌లో బయలుదేరి సుమారు 40 కి.మీ. దూరంలోని నెల్లూరు బ్యారేజీ దగ్గరకు మధ్యాహ్నం 2.18 గంటలకు వచ్చారు. పూజల అనంతరం నెల్లూరు బ్యారేజీ పైలాన్‌ను, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో తిరుపతి వెళ్లారు.

"రెండు ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితమిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కరవు మండలమంటూ ఉండదు. 2008లో సంగం బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. మహానేత ప్రారంభించిన ప్రాజెక్టును కుమారుడిగా నేను పూర్తిచేశా. రెండు ప్రాజెక్టులతో 5 లక్షల ఎకరాలకు సాగునీటికి అవకాశం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2 ప్రాజెక్టులు పూర్తిచేశాం. వరదలు, కరోనా ప్రభావం ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేయగలిగాం. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ అని పేరు పెట్టుకున్నాం. గౌతమ్‌రెడ్డి పేరుతో ఈ ప్రాజెక్టు పూర్తిచేసి జాతికి అంకితం చేశాం. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తూ వస్తున్నాం."-సీఎం జగన్​

ఇవీ చదవండి:

Agrigold: "వారంలోగా న్యాయం చేస్తామన్న జగన్​... ఇప్పటికీ పట్టించుకోవడంలేదు"

problem of funding పోలవరం నిధులకు దొరికేనా పరిష్కారం

సంతోషంగా జీవించడం ఎలాగో చెబుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

Last Updated : Sep 7, 2022, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details