BJP Protest: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో రైతులు నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మొదట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున రైతులు, భాజపా శ్రేణులు ర్యాలీగా తరలివచ్చారు. కలెక్టరేట్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నేతలు మండిపడ్డారు. తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. గిట్టుబాటు ధర రావడం లేదని. దళారులు దోపిడీకి రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని విమర్షించారు. మిల్లర్ల చేతిలో ఈ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఎఫ్సీఐ కొనుగోలు చేయనీయకుండా.. ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
అసమర్థ ప్రభుత్వం వల్లే కష్టాలు:నెల్లూరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్ద భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికుల ఆందోళనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నాయకులు మద్దతు తెలిపారు. బొగ్గు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నారని వీర్రాజు విమర్శించారు. రూ. కోట్లు సంపాదించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఈ కష్టాలు తలెత్తాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డెయిరీలు, సహకార మిల్లుల నష్టాలకూ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.