సంక్షేమ వసతి గృహాలు... సమస్యలకు నిలయాలు రాష్ట్రంలోని వసతి గృహాలు అధ్వానంగా మారాయి. మౌలిక సదుపాయాల లేమి, నాణ్యత లోపించిన ఆహారంతో లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీటన్నింటికి సాక్ష్యం.. కడప జిల్లా రాయచోటి గిరిజన గురుకులం. ఈనెల 12, 13 తేదీల్లో వసతిగృహంలో ఆహారం తీసుకున్న 73 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. సకాలంలో స్పందించి విద్యార్థులకు వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది. వార్డెన్ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే ఘటనలకు కారణం అని తెలుస్తోంది. వారానికోసారి వార్డన్ హాస్టల్‌కు వస్తారని... అంతా వాచ్ మెన్ చూసుకుంటారని పిల్లలు చెబుతున్నారు.
తడిసిన బియ్యంతోనే వంట
170 మంది విద్యార్థులున్న రాయచోటి గిరిజన గురుకులంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పారిశుద్ధ్యం పూర్తిగా కొరవడింది. వర్షానికి భవనంలోకి నీరు వస్తున్నందున బియ్యం బస్తాలు తడిసిపోయాయి. పిల్లలే వాటిని ఎండకు పోశారు. అవే వండి పిల్లలకు వడ్డిస్తున్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే
ప్రతి వసతి గృహాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు తనిఖీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా ఇంత వరకు ఎవరూ పాటించినట్లు లేదు. ఆయన సొంత జిల్లాలోనే ఇంత వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. కడప జిల్లాలో 100 సాంఘిక సంక్షేమ, 12 గిరిజన సంక్షేమ, 78 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1, 2మినహా మెజారిటీ వసతిగృహాల్లో సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
కర్నూలులోనూ ఇవే కష్టాలు
కర్నూలు జిల్లాలో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 104 ఉన్నాయి. వీటిలో మొత్తం 15 వేల మందికిపైగా బాలబాలికలు ఉన్నారు. కర్నూలు నగరంలోని హాస్టళ్లు చాలా వరకు అద్దెగదుల్లో నడుస్తున్నాయి. మరుగుదొడ్ల సమస్యల చాలా హాస్టళ్లో ఉంది. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వటంలేదు. సింగిల్ ఫేస్ విద్యుత్తు కనెక్షన్ కారణంగా మోటార్ తరుచూ మరమ్మతులకు గురవ్వటం వల్ల నీటి సమస్య అధికమవుతోంది. గతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించిన చర్యలు మాత్రం శూన్యం.
సింహపురిలో శిథిలావస్థలో భవనాలు
నెల్లూరు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యుత్ తీగలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నాణ్యత లేని విద్యుత్ పరికరాలు, భవనాలను ఆనుకుని ఉండే విద్యుత్ నియంత్రికలు, శిధిలావస్థకు చేరిన భవనాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 121 సంక్షేమ శాఖ బాలుర వసతిగృహాలు, 59 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. సుమారు 20,350మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహాలకు ఇంతవరకు సరైన భవనాలు లేవు. ప్రభుత్వ భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. తడలోని బీసీ బాలుర వసతిగృహం విద్యుత్ తీగల వలయంలో ఉంటుంది. అత్యధిక వోల్టేజి ప్రసరించే 11కేవీ తీగలు గోడలను తాకుతుంటాయి. 50 భవానాల్లో పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. ఇలా లక్షలాది మంది విద్యార్థులు.. వసతి గృహాల్లో సమస్యలతో సావాసం చేస్తున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.