తుంగభద్ర పుష్కరాలను నిర్వహించేందుకు అధికారులు గత మూడు నెలలుగా చర్యలు చేపట్టారు. వివిధ విభాగాల నుంచి ఘాట్ల నిర్మాణాలు, రహదారులు, సుందరీకరణ తదితర పనుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అన్ని పనుల కోసం సర్కారు 208 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి గత రెండు వారాలుగా పనులు ప్రారంభించారు. కొన్ని ఘాట్లు దాదాపు పూర్తయ్యాయి. రహదారులు, విద్యుదీకరణ, మురుగు నీరు తరలింపు తదితర పనులు జరుగుతున్నాయి.
వైద్య ఆరోగ్య శాఖ సూచనతో..
ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు జరగాల్సి ఉంది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 21 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు రహదారులు సైతం నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో లక్షల్లో జనం గుమికూడే అవకాశం ఉండటం, కరోనా మరోసారి విజృంభిస్తుందన్న సమాచారంతో.. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్య ఆరోగ్యశాఖ... ఉన్నతాధికారులకు సూచన చేసింది. ఈ కారణంగా.. పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వడం లేదని, పిండ ప్రదానం, పూజలు వంటి కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఇస్తున్నామని దేవాదాయశాఖ కార్యదర్శి గత నెల 22 న మెమో జారీ చేశారు.
గత పుష్కరాలకు 49 లక్షల మంది హాజరు
2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలకు సుమారు 49 లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి కరోనా ఉండటంతో అధికారులు ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. దీని కోసం 12 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి అనుమతి లేదని, ఈ-టికెట్ విధానంలో స్లాట్ బుక్ చేసుకున్నవారినే అనుమతించాలని, ఒక్కో ఘాట్లో గంటకు 60 మంది కన్నా ఎక్కువమందిని అనుమతించరాదని నిర్ణయించారు.