కర్నూలు అసెంబ్లీ సీటు కోసం... ఆ ప్రాంత తెదేపా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని టీజీ వెంకటేష్ పట్టుబడుతుండగా.. మరోమారు తనకే అవకాశం ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు నేతలు బహిరంగ వేదికలపైనే ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని... చాలాసార్లు పార్టీ పెద్దలు సర్దిచెప్పారు. అయినా... టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్‌రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఈమధ్య జరిగిన సంఘటన పార్టీకి మరోమారు తలనొప్పిగా మారింది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు సమీపంలో... ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలను నిర్మించింది. వీటి ప్రారంభోత్సవానికి ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా... టీజీ కుమారుడు భరత్... లబ్ధిదారులకు స్వాగతం పలుకుతూ... ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిని చూసిన మోహన్ రెడ్డి అనుచరులు... తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సభ ప్రారంభానికి ముందే... ఫ్లెక్సీలను చించేశారు. ఈ వ్యవహారమంతా... పోలీసులు చూస్తుండగానే జరిగిపోయింది. పోలీసులు... మోహన్ రెడ్డి అనుచరులను అరెస్టు చేసి, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. మోహన్ రెడ్డి రంగంలోకి దిగి... పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినా... ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అనుచరులను రిమాండ్‌కు పంపించారు. ఫ్లెక్సీలు చించేసిన విషయం తెలుసుకున్న టీజీ వెంకటేష్... గృహప్రవేశాల సభలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.