దేవుడి విగ్రహాల కేసులో అరెస్ట్ అయిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తితో జగన్ బావ అనిల్‌కు సంబంధాలున్నాయని మాజీ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. ప్రవీణ్ చక్రవర్తిని ఏడాదిపాటు ఎందుకు అరెస్టు చేయలేదని..? ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా అరెస్టు చేశారా లేదా అనే అనుమానం ఉందన్నారు. సీఐడీ విచారణ జరుగుతుందా లేదా అనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ చక్రవర్తి వీడియోపై ప్రభుత్వం పూర్తి విచారణ జరపాలన్నారు.
వాస్తవాలు బయటపెట్టాలి: కళా
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ప్రారంభ దశలోనే చర్యలు ఎందుకు తీసుకోలేదని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 23న ప్రవీణ్ చక్రవర్తి వీడియో విడుదల చేస్తే జనవరి 2021 వరకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కంటితుడుపు కోసం తూతూ మంత్రంగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై కేసు పెట్టారని విమర్శించారు. ప్రవీణ్ చక్రవర్తిపై తీవ్రతకు తగ్గ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్‌కు సీఎం జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఏం నిర్ధరణకు వచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్‌తో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ఎలా సంబంధాలు నెరుపుతారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మతమార్పిడులు, హిందూమతంపై దాడులు యథేచ్చగా సాగుతున్నాయనడానికి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలే నిదర్శనమని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ప్రవీణ్ చక్రవర్తి వెనకున్న ఎవరున్నారు, అతనికి అమెరికా నుంచి సాయం చేస్తున్నవారెవరనే అంశాలపై డీజీపీ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన బావ బ్రదర్ అనిల్ వ్యవహారశైలి వల్లే రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.