‘ఎక్కడో అమెరికాలోనో, హైదరాబాద్‌లోనో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ తక్కువ వడ్డీకి వస్తుందని పంటరుణాలు తీసుకుంటున్నారు. రైతులు కానివారంతా భూములు ఉన్నాయనో, రైతులుగానో చూపించుకుని సర్కారు సాయం పొందుతున్నారు. అలా కాకుండా.. నిజమైన రైతులకే ఫలితం అందాలని ఉద్దేశంతో మేం సంస్కరణలు తెచ్చాం’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.
పంట పండించే అసలైన రైతులను గుర్తించడానికే ఈ-క్రాప్ విధానం తెచ్చామని, ఏ భూముల్లో.. ఏ పంట.. ఏ రైతు ఎంత వేశారో తెలియాలంటే ఈ-క్రాప్‌లో నమోదు చేయాల్సిందేనని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంత మంచి విధానంలో తప్పులుంటే సూచించాలే తప్ప విమర్శించడం సరికాదన్నారు.
సకాలంలో రైతులు తిరిగి చెల్లిస్తే రూ.లక్ష లోపు తీసుకున్న రుణాలకు సున్నావడ్డీ కింద రాయితీ ఇవ్వాలన్నది పథకం ఉద్దేశమని తెలిపారు. ఉచిత బీమా, పెట్టుబడి, సున్నావడ్డీ, మార్కెటింగ్ సౌకర్యం అన్నదాతలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ-క్రాప్‌ను రైతులు వేసిన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఈ సంస్కరణల వల్లే సున్నావడ్డీ పంట రుణాల మొత్తం తగ్గిందని మంత్రి వివరించారు. రైతుల ముసుగులో రుణాలు పొందినవారిని కట్టడిచేస్తే విమర్శించడం సరికాదన్నారు.