కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతంగా సాగుతోంది. తొమ్మిదోరోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్ తండ్రి కృష్ణయ్యయాదవ్‌ను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. ఇప్పటికే కృష్ణయ్య కుమారులు కిరణ్‌కుమార్ యాదవ్, సునీల్‌కుమార్ యాదవ్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. 9 రోజుల పాటు పలువురు అనుమానితులను ప్రశ్నించారు.
సీబీఐ దూకుడు..
విచారణలో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత... తనకు, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ.. జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను మంగళవారం కలవడం ప్రాధాన్యత సంతరించుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత హైదరాబాద్ నుంచి మూడు రోజుల కిందట పులివెందులకు వచ్చారు. రెండు రోజుల కిందట వీరిద్దరితో పులివెందులోని వారి నివాసంలో సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు సమావేశం అయ్యారు. దర్యాప్తు జరుగుతున్న తీరు, వారికున్న అనుమానాలను సీబీఐ అధికారులు నివృత్తి చేసినట్లు సమాచారం.