పది మంది చుట్టుముట్టినా ఏ మాత్రం బెదరకుండా చేతిలో ఉన్న కర్రతో ప్రతిఘటిస్తూ వారిపై తిరగబడవచ్చు.. పది నిమిషాల్లో వారందరినీ మట్టి కరిపించవచ్చు. అందుకు ఏకైక సాధన కర్రసాము. అమ్మాయిల ఆత్మరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాచీన కళ అయిన కర్రసామును ఓ యువకుడు అందరికీ నేర్పుతున్నాడు.
చిన్నారులే అధికం..
కనుమరుగౌతున్న ఈ విద్యను భావితరలకు నేర్పుతూ కళకు ప్రాణం పోస్తున్నాడు కడపకు చెందిన జయ చంద్ర. డిగ్రీ చదువుతున్న సమయంలో కర్రసాముపై ఆసక్తితో తన తండ్రి సహకారంతో నేర్చుకున్నాడు. ఈ కళను మరికొంత మందికి చేరువ చేయాలనే సంకల్పంతో.. కడప సీఎస్ఐ పాఠశాల ఆవరణంలో ఆసక్తి కలిగిన కొంత మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు. చిన్న పిల్లల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారందరికీ కర్రసాము నేర్పిస్తున్నాడు. అయితే ఈ కళను ఎక్కువ మంది చిన్నారులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.
ఆకతాయిలను అడ్డుకునేందుకు
ప్రస్తుత రోజుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ కర్ర సాము ఎంతో ఉపయోగపడుతోందని చెబుతున్నాడు జయచంద్ర. కర్ర చేతిలో లేకపోయిన ఆకతాయిల నుంచి తమను తాము ఎదుర్కొనేలా కూడా మహిళలకు శిక్షణ ఇస్తున్నాడు.