Live person recorded as dead: వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బతికున్న వ్యక్తిని మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేయడంతోపాటు.. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే.. తాను బతికే ఉన్నానని, తన భార్య గ్రామ సచివాలయ వాలంటీర్‌గా పని చేస్తున్నందున వీఆర్వోతో కలిసి మరణ ధ్రువీకరణ పత్రం పొంది వితంతు పింఛనుకు ప్రయత్నిస్తోందని బాధితుడు బళ్లారి సుభాహాన్ బాషా ఆరోపిస్తున్నారు. తాను ప్రాణాలతోనే ఉన్నానని, తనకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
బాధితుడు తెలిపిన ప్రకారం... రాయచోటిలో ఓ మహిళను వివాహం చేసుకున్న బాధితుడికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. మనస్పర్థలతో భార్యాభర్తలు కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిశాడు సుభాహాన్ బాషా. అయితే.. రేషన్ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది సమాధానమిచ్చారు.