Police took action on loan app: ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే సులభంగా రుణాలు దొరుకుతుండటంతో జనం లోన్ యాప్‌ల పట్ల ఆకర్షితులవుతున్నారు. రుణం సులభంగానే దొరికినా ఆ తర్వాత చెల్లింపుల విషయంలో ఎదురవుతున్న బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. లోన్ యాప్ మోసాలను అరికట్టడాలని రాష్ట్రాలకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖ లోన్ యాప్ కేసులను దుమ్ముదులిపి బయటికి తీస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన వై.ఎస్.ఆర్.జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ లో బండి సాయికుమార్ రెడ్డి అనే లోన్ యాప్ బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఆ కేసును ఆరునెలల తర్వాత పోలీసులు చేధించారు. ఓ సిమెంటు కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయికుమార్ రెడ్డి.. జనవరిలో "రుపీస్ క్యాష్, రుపీస్ లోన్" యాప్ ల ద్వారా 95 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. బాధితుడు అనేక విడతల్లో3 లక్షల 71 వేల రూపాయలు చెల్లించినా.. ఇంకా 99 వేలు బకాయి ఉన్నావంటూ నిర్వాహకులు ఫోన్లు చేసి బెదిరించారు. దీంతో బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్ 19న సీకేదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశాడు
బాధితుడి యూపీఐ నంబర్లు, నిందితుల బ్యాంకు ఖాతా నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవలే రంగనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే.. అసలు దొంగల జాడ తెలిసింది. హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా లోన్ యాప్ మోసాలు సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.