Gold medal for Kadapa youngstar: ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కడప యువకుడికి బంగారు పతకం దక్కింది. ఉత్తర ఐరోపాలోని ఎస్తోనియాలో దేశంలో జరిగిన ప్రపంచ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలో స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ప్రపంచ దేశాల నుంచి వేలమంది విలువిద్య క్రీడాకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి కూడా పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. కడపకు చెందిన ధనుర్విద్య క్రీడాకారుడు ఉదయ్ కుమార్‌కు బంగారు పతకం లభించింది. ఉదయ్ కుమార్‌కు రెండోసారి అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం దక్కడం విశేషం. స్వర్ణం రావడంతో కడపలోని ఆర్చరీ క్రీడాకారులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ ఉదయ్: కడప జిల్లాకు చెందిన ఉదయ్ 2007లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. విలువిద్యలో శిక్షణ తీసుకునేందుకు 2010లో చెన్నైకి వెళ్లాడు. అనతికాలంలోనే ఆర్చరీలో పట్టు సాధించాడు. 2015లో ముంబయిలో జరిగిన జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్యం గెలుచుకున్నాడు. 2018లో 15 నిమిషాల 15 సెకన్లలో 200కుపైగా బాణాలు వేగంగా సంధించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. 2019లో న్యూజిలాండ్‌లో జరిగిన ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజతం సాధించాడు..
ఆర్చరీలో లెవల్-1, లెవల్-2, లెవల్-3 హోదాలు ఉన్నాయి. 2021లో ట్రెడిషన్ ఆర్చరీ సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలో రెండో స్థానం కైవసం చేసుకుని లెవల్-2 పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం దేశంలో ఆర్చరీ లెవల్-2 కోచ్ లు నలుగురు మాత్రమే ఉండగా.. వారిలో ఉదయ్ కుమార్ ఒకడు. ప్రస్తుతం లెవల్-2 హోదాలో ఉన్న ఉదయ్.. ధనుర్విద్యలో చెప్పిన విధంగా అన్ని విభాగాల్లో బాణాలు వేయగలడు.
ఇటీవలే ముంబయిలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఇండియాస్ గాట్ టాలెంట్ రియాల్టీషోలో ఉదయ్ కుమార్ పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒకేసారి రెండు బాణాలు సంధించి లక్ష్యాన్ని చేధించి.. నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.