మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య (viveka murder case) కేసులో సీబీఐ విచారణ 102వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు.. నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని విచారిస్తున్నారు. న్యాయవాది ఓబుల్‌రెడ్డి సమక్షంలో ఉమాశంకర్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉమాశంకర్‌రెడ్డికి ఈనెల 20 వరకు సీబీఐ కస్టడీ పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది.
కేసు దర్యాప్తునకు సహకరించట్లేదని ఉమాశంకర్‌రెడ్డి (37)ని గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందుల జూనియర్ సివిల్ కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం ఉమాశంకర్‌రెడ్డిని అయిదు రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న కోర్టు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
‘వివేకానందరెడ్డి హత్య కేసులో (viveka murder case) ఉమాశంకర్‌రెడ్డి పాత్రను సునీల్‌యాదవ్, దస్తగిరి తమ వాంగ్మూలంలో ధ్రువీకరించారు. హత్యకు ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమానంతో.. వివేకా ఇంటి సమీపంలో ఉండే కుక్కను సునీల్‌యాదవ్‌తో కలిసి ఉమాశంకర్‌రెడ్డి తన కారుతో గుద్ది చంపారు. ఆగస్టు 11న ఉమాశంకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు తెలుపు, లేత నీలం రంగు చొక్కాలను, సునీల్ యాదవ్, ఇతర అనుమానితుల ఇంట్లో రక్తపు మరకలతో కూడిన చొక్కాలను స్వాధీనం చేసుకున్నాం. వాటికి సంబంధించి చండీగఢ్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి నివేదిక రావాల్సి ఉంది. వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి లేదా ఇతర ఆయుధాలను గుర్తించే ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. ఉమాశంకర్‌రెడ్డిని గురువారం విచారణకు పిలిచి కీలక అంశాలపై ప్రశ్నించగా సరైన సమాధానాలు ఇవ్వలేదు. అతనికి తెలిసిన విషయాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు, హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతణ్ని కస్టడీలోకి తీసుకోవడం చాలా అవసరం’ అని కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మహాశివగంగభవాని పాల డెయిరీ నిర్వహిస్తున్నారు. అతను వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి తమ్ముడు. వీరికి మొదటి నుంచి వివేకా, ఆయన కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సింహాద్రిపురం మండలం రావులకొలనులో వివేకా పొలాలను, మినీ పాల కేంద్ర నిర్వహణ బాధ్యతలను జగదీశ్వర్‌రెడ్డి చూస్తున్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్‌యాదవ్‌ను ఉమాశంకర్‌రెడ్డే వివేకాకు పరిచయం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి:
CBI PETITION: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్