Farmers locked Village Secretariat: వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామ సచివాలయానికి రైతులు తాళం వేశారు. ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా తమకు అందలేదని ఆగ్రహంతో అన్నదాతలు సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేశారు.
మాచనూర్ గ్రామంలో దాదాపు 600 రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే పంటల బీమా కేవలం 20 శాతం మందికి మాత్రమే వర్తింపజేశారని.. మిగిలిన వారందరికీ మొండి చెయ్యి చూపారని రైతులు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సచివాలయంలోని సిబ్బంది అందరినీ బయటికి పంపి...కార్యాలయానికి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినని అన్నదాతలు తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. పత్తి పంటకు ఈ-క్రాప్ నమోదు చేసుకున్నప్పటికీ పంటల బీమా ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు.