కొవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ... ప్రజల సహకారం కూడా చాలా అవసరమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప నియోజక వర్గంలో కొవిడ్ నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల పాజిటివ్ కేసులు నమోదైతే... ఒక్క కడప నగరంలోనే ఆరు వేలకు పైగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
సమయం పెంపు...
అన్ లాక్-4 మార్గ దర్శకాలను కేంద్రం విడుదల చేసిన నేపథ్యంలో... కడప నగరంలో కూడా వ్యాపార సముదాయాలకు సమయాన్ని పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వ్యాపార దుకాణాలు తెరుస్తున్నారు. ఇవాళ్టి నుంచి దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు తెరుచుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే కరోనా వైరస్ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదన్నారు. కడప నగరంలోకి కొవిడ్ కేర్ కేంద్రాలు, సంజీవని బస్సుల ద్వారా కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బాషా తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి నగరంలో ఓ ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించారు.
ఇదీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా నెగెటివ్