పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడంపై వైకాపా తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికలు వద్దని ప్రభుత్వం పదే పదే కోరుతున్నా వాటిని పక్కన పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2018లోనే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా... అప్పట్నుంచి పదవిలో ఉన్నా.. నిమ్మగడ్డ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కరోనాతో ఉద్యోగులు మరణిస్తే ఎవరూ బాధ్యులని నిలదీశారు.
వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ రెండూ ఒకేసారి నిర్వహించటం కష్టంతో కూడిన పని కాబట్టే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని... తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు తమ అభిప్రాయం చెబుతామన్నారు.