ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మోటుపల్లి రమాదేవి తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రే ఆమెను పెంచి పెద్ద చేశారు. ఆమెకు మున్సిపాలిటీలో స్వీపర్‌గా ఉద్యోగం వచ్చింది. 2015లో పొదిలిలో పోస్టల్ శాఖలో పనిచేసే ముసలయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. వారికి 2019లో బాబు జన్మించాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. తన భర్త మద్యం తాగి తరచూ ఆమెను కొట్టడం, అనుమానంతో వేధించడం ప్రారంభించాడు. ఆ చిత్రహింసలు భరించలేక రమాదేవి పుట్టింటికి వచ్చింది. వారి కాపురం చక్కదిద్దడానికి తండ్రి అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమార్తె పడుతున్న బాధలు చూడలేక ఆయన 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి ఆమె తన బంధువుల వద్ద తలదాచుకుంటోంది.
స్వీపర్‌గా పనిచేస్తూ వచ్చే జీతంతో బాబును పోషించుకుంటోంది. ఈ క్రమంలో బంధువులు ఆమె నుంచి బిడ్డను దూరం చేసి ఒంగోలులోని శిశువిహార్‌కు పంపించారని రమాదేవి ఆరోపించింది. పసిబిడ్డను తన నుంచి దూరం చేయడంతో ఆ తల్లి విలవిల్లాడింది. తన బిడ్డను ఎలాగైనా దగ్గరకు చేర్చాలంటూ బంధువుల కాళ్లావేళ్లా పడి వేడుకుంది. కనికరించని బంధువులు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు. భరించలేని రమాదేవి 20 రోజుల కిందట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆసుపత్రిలో చేర్చి ఆమెను కాపాడారు. గురువారం అర్ధరాత్రి ఒంగోలు నుంచి గుంటూరు వచ్చి... న్యూగుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.