ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు, ఇతర నేరాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు నగరంలో ఆదివారం ఉదయం కుసుమ హరినాథ గుడిలో చోరీకి పాల్పడిన నిందితుడిని కొద్ది గంటల్లోనే అరెస్టు చేశామన్నారు. చోరీకి గురైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
విగ్రహాల చోరీ విషయాన్ని ఉదయం పది గంటలకు దేవాలయ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాం. కొద్దిసేపట్లోనే లాలాపేట పోలీసులు నిందితుడు పోలిశెట్టి దుర్గ అలియాస్ మహేష్‌ను అరెస్ట్ చేశారు. ఇతనిపై గతంలో విజయవాడ, గుంటూరులో మూడు చోరీ కేసులు ఉన్నాయి. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. జిల్లాలోని ఆలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నాం - ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ