Tension at Tadepalligudem Panchayat Raj office: పార్టీలకు అతీతంగా సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని గర్జించారు. నిధులు ఇవ్వాలని, లేదంటే సర్పంచి పదవులను రద్దుచేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఆగ్రహోదగ్రులయ్యారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం కనిపించిన వాతావరణమిది.
గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.948 కోట్లను విడుదల చేయాలన్న డిమాండుతో పలు జిల్లాల సర్పంచులు కమిషనర్ కార్యాలయం ముట్టడికి శుక్రవారం యత్నించారు. ఒకరోజు ముందే సర్పంచుల సంఘం పిలుపునివ్వడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచులు కార్యక్రమానికి హాజరుకాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కమిషనర్ కార్యాలయానికి ఇతరులెవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. పలు జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సర్పంచులు శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.
తమ డిమాండ్లతో కూడిన నినాదాల ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఈలోగా పంచాయతీరాజ్‌శాఖ ఉప కమిషనర్లు డి.సత్యనారాయణ, నాగార్జునసాగర్, గణాంకాధికారి వీరాంజనేయులు వచ్చి సర్పంచులతో మాట్లాడారు. సర్పంచులు మూకుమ్మడిగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్యలపై వినతిపత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేవరకూ కదిలేది లేదని సర్పంచులు పట్టుబట్టారు.
పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పలు వాహనాల్లో మంగళగిరి స్టేషన్‌కు తీసుకెళ్లి 32 మందిని అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. అనంతరం సర్పంచులంతా అక్కడే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరెస్టయిన సర్పంచులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మంగళగిరిలో కలిసి పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు.
నిధులు కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
‘15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇప్పటికైనా కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం. న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా వెనకాడేది లేదు. శాంతియుత వాతావరణంలో సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన సర్పంచులను అరెస్టు చేయడం అన్యాయం.’ అని ఉమ్మడి గుంటూరు జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ పాపారావు ఆగ్రహించారు.
బోనులో నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్నే..