ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

rape case: అత్యాచారం కేసులో ఆఫ్కాఫ్‌ ఛైర్మన్‌ - అత్యాచారం కేసులో ఆఫ్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు

గుంటూరుకు చెందిన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఆఫ్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషన్‌ విచారణకు ఆదేశించింది.తన కుమార్తెను అనిల్‌ ఆయన అతిథిగృహాలు, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆరోపించారు.

కొండూరు అనిల్‌బాబు
కొండూరు అనిల్‌బాబు

By

Published : Mar 27, 2022, 5:25 AM IST

గుంటూరుకు చెందిన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత, ఏపీ ఫిషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఆఫ్కాఫ్‌) ఛైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను అనిల్‌ ఆయన అతిథిగృహాలు, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించటంతో తన కుమార్తె భయపడి, విచారణ సమయంలో ఆయన పేరు చెప్పలేదని తాజాగా ఎస్సీ కమిషన్‌కు చెప్పారు. దీనిపై కమిషన్‌ విచారణకు ఆదేశించింది. గతంలో ఆ బాలిక కోర్టు, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుయాయుడు కన్నా భూశంకర్‌ ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాలికపై అత్యాచారం కేసులో మరికొందరు ఉన్నారని బాలిక తండ్రి తనకు వినతిపత్రం అందజేశారని, దీనిపై విచారణ చేపట్టాలని గుంటూరు పోలీసులను ఆదేశించినట్లు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ధ్రువీకరించారు.

ఏడాది క్రితం బాధిత బాలిక, ఆమె తల్లి కరోనా సోకి గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. తల్లి మృతిచెందగా బాలిక కోలుకుంది.ఈ క్రమంలో ఓ మహిళ తాను ఇక్కడ నర్సుగా పనిచేస్తున్నానని బాలిక తండ్రిని పరిచయం చేసుకుంది. బాలికకు భవిష్యత్‌లో కరోనా రాకుండా నాటు వైద్యం చేయిస్తానని ఇంటికి తీసుకెళ్లింది. కొన్నిరోజుల తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించింది. తన కుమార్తె కనిపించటం లేదని ఆమె తండ్రి గతేడాది డిసెంబరులో మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం ఆమె చెర నుంచి తప్పించుకుని గుంటూరు శివారు పేరేచర్లలో ఉంటున్న తండ్రి వద్దకు చేరుకుంది. జరిగిన విషయం తండ్రికి చెప్పటంతో మేడికొండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాలికకు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన మహిళ అరండల్‌పేట స్టేషన్‌ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. గుంటూరుతో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో విటుల వద్దకు పంపినట్లు ఆమెతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఉమెన్‌ ట్రాఫికింగ్‌, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు 66 మందిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చెప్పారు. తాజాగా బాలిక తండ్రి ఎస్సీ కమిషన్‌కు చేసిన ఫిర్యాదు తనకు అందలేదని.. బహుశా పోస్టులో ఉందేమోనని అన్నారు.

నాకు సంబంధం లేదు

‘ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి అతిథి గృహాలూ లేవు. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక బాలిక తండ్రిని ఎవరో ప్రలోభపెట్టి నాపై ఫిర్యాదు చేయించారు. ఎవరో వెనక ఉండి నాపై ఈ కుట్ర పన్నారు. లేకపోతే 4 నెలల క్రితం జరిగిన కేసులో ఇప్పుడు నాపేరు చెప్పడం ఏమిటి? ఏ విచారణకైనా సిద్ధమే.’ - కొండూరు అనిల్‌బాబు

ఇదీ చదవండి:పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

ABOUT THE AUTHOR

...view details