NO SUPPORT PRICE TO PADDY: బహిరంగ మార్కెట్‌లో ధాన్యం ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బస్తా ధర రూ. 1,050 నుంచి రూ. 1,200 వరకు అమ్ముతున్నారు. ఫలితంగా దళారుల మాయాజాలానికి రైతులు బలవుతున్నారు. గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో ఏటా మాదిరిగానే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక కారణాలు, రైతుల్లో అవగాహన లోపం కూడా ఇందుకు కారణమయ్యాయి. దీంతో వ్యాపారులు, మిల్లర్లదే రాజ్యంగా మారింది. ప్రైవేటు వ్యాపారులు.. గ్రామాల్లోకే వచ్చి ధాన్యం నిల్వలు కొంటున్నారు.
ఈ ఏడాది పంట చేతికొస్తున్న దశలో అతివృష్టికి వరిచేలు నేలవాలాయి. అక్కడక్కడా మట్టిబెడ్డలు, తేమశాతం, రంగుమారిన ధాన్యం వంటివి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ ఆయుకట్టు పరిధిలో ధాన్యం ఊడ్పులు ప్రారంభం కాగా.. మరికొన్నిచోట్ల వరిచేలు కోత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో సాధ్యమైనంత వేగంగా ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఫలితంగా బస్తాకు రూ. 1,050 నుంచి రూ. 1,200 వరకు ధర మించడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఈ సీజన్‌లో కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ప్రభుత్వం A- గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ. 1,960, కామన్ గ్రేడ్‌కు రూ. 1,940 చొప్పున ధరల్ని ప్రకటించింది. జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లాయంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరో వైపు అక్కడికి వెళ్లడానికి రైతులు ఇష్టపడటం లేదు. వాహనం ద్వారా ధాన్యం తీసుకెళ్లి టోకెన్ తీసుకుని ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. డబ్బులు కూడా నేరుగా ఇవ్వకుండా ఖాతాల్లో వేస్తారని.. అవి కూడా ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదని వాపోతున్నారు. అందుకోసమే ధర తక్కువైనా సులభంగా ఉంటుందని.. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడమే సరైన మార్గమని రైతులు భావిస్తున్నారు.