ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

sc commission at guntur : రమ్య కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడికి కఠిన శిక్ష ఖాయం: జాతీయ ఎస్సీ కమిషన్‌ - రమ్య హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ

రమ్య హత్య ఘటనపై నిజనిర్ధారణ కోసం గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన హడావుడిగా సాగింది. హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్​కు చూపించకుండానే అధికారులు వారిని తీసుకెళ్లారు. రమ్య కుటుంబంతో మాట్లాడిన తర్వాత రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. రమ్య హత్య కేసుని తీవ్రంగా పరిగణించామని... దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎస్సీ కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హెల్దేర్ పేర్కొన్నారు.

SC Commission visit Guntur
గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన

By

Published : Aug 24, 2021, 5:28 PM IST

Updated : Aug 25, 2021, 3:49 AM IST

రమ్య కేసులో దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్న ఎస్సీ కమిషన్

గుంటూరులో దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి, బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబీకులను పరామర్శించి, వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు గుంటూరుకు పోటెత్తారు. తమకు జరిగిన అన్యాయాలపై కమిషన్‌ సభ్యులకు రాతపూర్వకంగా వినతులు అందజేశారు. దళితులపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం, కేసుల విచారణలో కొందరు పోలీసుల వైఖరిని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. పదోన్నతుల్లో అన్యాయాలు, ప్రభుత్వ శాఖలు, వర్శిటీల్లో పేరుకుపోయిన బ్యాక్‌లాగ్‌ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు వినతులు సమర్పించాయి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను తెదేపా సహా విపక్షాలు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. మరోవైపు కమిషన్‌ పర్యటనలో వైకాపా నాయకులు హల్‌చల్‌ చేశారు. జై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కమిషన్‌ కాన్వాయ్‌లోకి వారి వాహనాలు చేరినా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. పర్యటనలో భాజపా నాయకులను అడ్డుకోవడంతో వారు సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో రసాభాసగా మారింది.

ఈ నెల 15న గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబీకులను కలిసేందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్దర్‌, సభ్యులు డాక్టర్‌ అంజూ బాలా, సుభాష్‌ పార్ధీ మంగళవారం గుంటూరులోని వారి నివాసానికి వచ్చారు. రమ్య తల్లిదండ్రులు ఎన్‌.జ్యోతి, వెంకటరావులతో సుమారు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటన అనంతరం ప్రభుత్వం, పోలీసులు స్పందించిన తీరు, ప్రభుత్వ సాయం తదితర అంశాలపై ఆరా తీశారు. కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని వివిధ సమస్యలపై దళితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అరుణ్‌ హల్దర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అన్యాయాలకు సంబంధించి తమకు అనేక వినతులు అందాయన్నారు. వాటన్నింటిపై కమిషన్‌ లోతుగా అధ్యయనం చేస్తుందని చెప్పారు. దళితుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగినట్లు తమ పరిశీలనలో గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామన్నారు. అన్యాయాలపై బాధితులకు ప్రభుత్వపరంగా న్యాయం జరగకపోతే నేరుగా కమిషన్‌ను సంప్రదించాలని కోరారు.

పర్యటన రసాభాస

రమ్య హత్యకు గురైన స్థలాన్ని కమిషన్‌ పరిశీలిస్తుందని షెడ్యూల్‌లో పేర్కొనడంతో భాజపా ఎస్సీ మహిళా మోర్చా నాయకులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారి రాకపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని, కమిషన్‌ సభ్యులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వస్తారని, అక్కడే కలిసి ఏదైనా చెప్పుకోవాలని సూచించారు. దీంతో భాజపా కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఈలోగా కమిషన్‌ కాన్వాయ్‌ విజయవాడ నుంచి నేరుగా రమ్య ఇంటికి చేరుకుంది. ఆ కాన్వాయ్‌లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బోరుగడ్డ అనిల్‌, వారి అనుయాయులు ఉన్నారని, వారిని పంపి తమను ఎలా అడ్డుకుంటారని భాజపా మహిళా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా వారిని రమ్య నివాసానికి రాకుండా పోలీసు రోప్‌ పార్టీ అడ్డుకోవడంతో మహిళలు రహదారిపై బైఠాయించారు. ఇదే సమయంలో బోరుగడ్డ అనిల్‌ వారి వద్దకు చేరుకుని జై జగన్‌, దళిత వ్యతిరేకి చంద్రబాబు అంటూ రెచ్చగొట్టే నినాదాలిచ్చారు. దీంతో వారిని ఎలా అనుమతించారు? తమను అడ్డుకోవడం ఏమిటని చెప్పి పోలీసు రోప్‌ పార్టీని తోసుకుని వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి భాజపా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మతో పాటు నళిని అనే నాయకురాలు కింద పడిపోయారు. నళిని పది నిమిషాల తర్వాత కూడా స్పృహలోకి రాకపోవడంతో ఆమెను ప్రైవేటు వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు.

ఆహ్వానించిన మమ్మల్నే అడ్డుకున్నారు: భాజపా

భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి యామినీ శర్మ మాట్లాడుతూ.. ‘మేమంతా దిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి రమ్య హత్య గురించి వివరించి ఘటనాస్థలానికి రావాలని ఆహ్వానించాం. ఇందులో భాగంగానే కమిషన్‌ గుంటూరు వచ్చింది. గన్నవరం నుంచి మేం వారిని స్వాగతిస్తూ తీసుకొచ్చాం. గుంటూరుకు రాగానే పోలీసులు మమ్మల్ని అడ్డుకుని వైకాపా నాయకులను కాన్వాయ్‌లో పంపి ఏకపక్షంగా వ్యవహరించారు’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల విషయంలో ప్రభుత్వ మెతక వైఖరిని కమిషన్‌కు తెలియజేస్తామనే భయంతోనే పోలీసులు తమను అడ్డగించారని ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పడానికి వైకాపా నేతలను కమిషన్‌ ముంగిటకు వచ్చేలా చేశారని రాష్ట్ర మహిళామోర్చా నాయకురాళ్లు మాలతీరాణి, బొడ్డు నాగలక్ష్మి విమర్శించారు. అనంతరం వీరు పార్టీ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు తదితరులతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని కమిషన్‌ సభ్యులను కలిశారు. తమను పోలీసులు అడ్డుకున్న తీరును వివరించారు.

ఘటనాస్థలాన్ని చూడకుండానే..

త్య జరిగిన ప్రదేశాన్ని కమిషన్‌ పరిశీలిస్తుందని పోలీసులు ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. ఘటనాస్థలం చుట్టూ బారికేడ్లు అడ్డుపెట్టారు. కానీ కమిషన్‌ బృందం అక్కడికి రాకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

ఇక రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కమిషన్ సభ్యులు సుభాష్ పార్థి తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందరి నుంచి వినతులు తీసుకున్న అనంతరం ఎస్సీ కమిషన్ బృందం.. సచివాలయానికి వెళ్లింది.

ఇదీ చదవండి..

Ramya Murder Case: సీఎస్, డీజీపీతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు భేటీ

Last Updated : Aug 25, 2021, 3:49 AM IST

ABOUT THE AUTHOR

...view details