గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ ఉన్న సమయంలో ఓ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొందరి పోలీసుల అత్యుత్సాహం వారిని సీబీఐ బోనెక్కేలా చేసింది. క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలపై 2019 అక్టోబర్ 14న గుంటూరుకు చెందిన రాయిడి శ్రీనివాసరావు, తూమాటి శ్రీనివాసరావు, నలబోలు ఆదినారాయణను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చూపించలేదు, కోర్టులో ప్రవేశపెట్టలేదు. విచారణ పేరుతో 15రోజులు నిర్భందించారు. ఆ ముగ్గురి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారంపాటు పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవటంతో న్యాయవాది ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ చేశారు. అయితే ఆ ముగ్గురూ తమ కస్టడిలో లేరని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఇలా చిక్కారు...
బాధితుల కుటుంబ సభ్యులు ఇక గుంటూరు కోర్టులో సెర్చ్ పిటిషన్ చేశారు. ఇబ్బంది తలెత్తుతుందని భావించిన పోలీసులు... ఆ ముగ్గురిని అక్టోబర్ 31 రాత్రి సీసీఎస్ నుంచి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాకోడూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటే అరెస్టు చేసినట్లు కథ అల్లారు. గుంటూరు ఆరో జూనియర్ సివిల్ జడ్జి వద్దకు కేసు విచారణ వచ్చింది. ఆ సందర్భంగా ముగ్గురు వ్యక్తులు తమని అక్టోబర్ 14నే పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురి సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్టోబర్ 14నుంచి 30వరకూ సీసీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్నట్లు తేలింది.