ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో భారీ వర్షాలు.. జలదిగ్భంధంలో లోతట్టు ప్రాంతాలు

Rains in ap: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

heavy rains in ap
ఏపీలో భారీ వర్షాలు

By

Published : Oct 15, 2022, 3:26 PM IST

Updated : Oct 15, 2022, 9:11 PM IST

Heavy Rains in AP:జోరు వానతో.. రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ప్రధానరోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పరిసరాల్లో కుండపోత వర్షం కురిసింది. తిరువూరు బైపాస్ రోడ్డు నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ప్రధాన రహదారి వాగును తలపిస్తోంది. నందిగామలో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీలు సరిగాలేక.. గుంటూరు శివారు లోతట్టు ప్రాంతాల్ని మురుగు నీరు ముంచెత్తింది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో వాగు, వంకలు పొంగి పొర్లాయి. తాండవ నదికి వరద పోటెత్తింది. అరకులోయ ఘాట్‌ రోడ్ లో.. కొండపై నుంచి వస్తున్న వర్షపు నీటికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమ జిల్లాలో.. గోతుల రోడ్లు వర్షాలకు నీటి కుంటల్లా మారాయి.

విజయనగరం.. పీవీటీ మార్కెట్, ఐస్ ఫ్యాక్టరీ కూడలి, నగరపాలిక కూడలి.. జలమయం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా.. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో రోడ్లపై నీరు ప్రవహించింది. నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి పొంగిపొర్లింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో లోతట్టు కాలనీలు.. అధ్వానంగా మారాయి. సత్యసాయి జిల్లా హిందూపురం కొట్నూరు చెరువులోని చౌడేశ్వరి కాలనీ వద్ద మరువ ప్రవాహానికి.. కాలనీ జలదిగ్బంధమవగా.. తెదేపా నేతలు ముంపు బాధితులకు సహాయం అందించారు.

కర్నూలు-కడప జిల్లాలో వర్షాలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. చిత్రావతి జలాశయ 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు.. జలదిగ్భంధంలో లోతట్టు ప్రాంతాలు

ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుంటూరు - తుళ్లూరు రహదారిపై పెద్దపాలెం వద్ద కొట్టేల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెదపరిమి - మంగళగిరి మధ్య నీరుకొండ వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై వర్షపు నీరు నిలవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో కొన్నిచోట్ల వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగాయి.

విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. విశాఖ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ జోరు వానలు పడుతున్నాయి. మధురవాడ, ఆనందపురం, ఎండాడ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హనుమంతవాక, ఓల్డ్‌ డెయిరీ ఫామ్‌, గాజువాక, కూర్మన్నపాలెం, మల్కాపురం, సింధియా, జ్ఞానాపురం, పాతనగరం, అక్కయపాలెంలో వర్షం పడుతోంది. బీచ్‌ రోడ్డు, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, మర్రిపాలెంలోనూ వాన కురుస్తోంది

అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పాయకరావుపేటలో తాండవ నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. అనకాపల్లిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం అయ్యింది. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సత్యసాయి జిల్లా: వరసగా మూడురోజులు ఎడతెరిలోకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా శ్రీ సత్య సాయి జిల్లాలోని హిదూపురం మండలం మలుగూరు గ్రామంలో ఇంటిపై కప్పు కూలి శ్రీకాంత్​ అనే రెడేళ్ల బాలుడు మృతి చెందాడు. మూడు రోజులుగా ఏక ధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అర్థరాత్రి ఒక ఇంటిపై కప్పు కూలిపోయింది. ఆ సమయంలో చంద్రప్ప అతని కుటుంబ సభ్యులు ఇంటిలో నిద్రిస్తుండగా అప్రమత్తమై అందరూ బయటకి వచ్చేయగా రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదం బారిన పడ్డాడు. అక్కడే చిక్కుకున్న బాలుడు శ్రీకాంత్​ అక్కడిక్కడే మృతి చెందాడు. తమ బిడ్డని కాపాడుకోలేకపోయామంటూ కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కృష్ణా జిల్లాలోని దివిసీమలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి అవనిగడ్డ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న టెంట్లు పనులు నిలిచిపోయింది. అవనిగడ్డ నాగాయలంక ప్రధాన రహదారి జలమయం కావటంతో జనజీవనం స్తంభించిపోయింది.

ఎగువ కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం, నాగర్జున సాగర్‌ నుంచి నీరు వదులుతుండటంతో పులిచింతలకు నీటి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు నుంచి 15గేట్లు ఎత్తి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details