జిల్లాల పునర్విభజనలో గుంటూరు మూడు జిల్లాలుగా ఏర్పాటైంది. గుంటూరు జిల్లా అత్యధికంగా నగర, పట్టణ జనాభాను కలిగి ఉండటంతో భవిష్యత్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, ఆర్థిక సంఘం నుంచి పలు రకాల గ్రాంట్లు వచ్చి జిల్లా మరింతగా అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, ఆహ్లాదాన్ని పంచటానికి ఉద్యానవనాలు, ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్‌లు, జిమ్ములు వంటివి సమకూరతాయి. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై తరహాలో గుంటూరు జిల్లాలోనూ ఎటు చూసినా పట్టణాలే ఉన్నాయి. గుంటూరు, మంగళగిరి నియోజకవర్గాల మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఈ పరిధిలోనే గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి రెండు నగరపాలక సంస్థలు ఉన్నాయి. గుంటూరు నగర విస్తీర్ణం 159 చదరపు కిలోమీటర్లు. ఉదాహరణకు గోరంట్ల నుంచి ఏటుకూరుకు 12-13 కిలోమీటర్లు ఉంది. ఇలా ఎటుచూసినా నగర పరిధి 12-13 కిలోమీటర్లు ఉంది.
పెద్ద పట్టణం తెనాలి:గుంటూరు జిల్లాలో సుమారు లక్షకు పైగా జనాభాతో తెనాలి పట్టణం అతిపెద్ద మున్సిపాల్టీగా ఉంది. ఆ తర్వాత పొన్నూరు పురపాలక ఉంది. ఇక్కడ కూడా సుమారు 60 వేల మంది నివసిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గుంటూరు రూరల్ మండలంలో 8 డివిజన్లు గుంటూరు నగరపాలక పరిధిలో ఉన్నాయి. దీంతోప్రత్తిపాడు నియోజకవర్గం సైతం కొంత భాగం పట్టణ ప్రాంతమే. తాడికొండ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాజధాని గ్రామాలు స్మార్టు సిటీస్ పథకం కింద ఉన్నాయి. ఆపై అది క్యాపిటల్ రీజియన్ ప్రాంతం. ఇలా గుంటూరు జిల్లా పట్టణ జనాభా కలిగిన ప్రాంతంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం తర్వాత మూడో పెద్ద నగరం గుంటూరు కావటం విశేషం. ఇక్కడ పది లక్షల మందికి పైగా జనాభా ఉంటోంది. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక పరిధిలోనూ ఇంచుమించు 3 లక్షలకుపైగా జనాభా ఉంటున్నారు. ఇంత పట్టణ జనాభాను కలిగిన గుంటూరు జిల్లాకు పట్టణ, నగరీకరణ పథకం కింద కేంద్రం నుంచి ఆయా గ్రాంట్లు మంజూరవుతాయి. ఆ నిధులతో జిల్లా పరిధిలోని పట్టణాలను బాగా అభివృద్ధి చేసుకోచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరం విస్తీర్ణం పరంగా ఎటుచూసినా 12-13 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత పెద్ద విస్తీర్ణంలో కోర్ ఏరియాలో మాత్రమే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని, శివారు ప్రాంతాలను పట్టించుకోవటం లేదన్న అపవాదు ఉంది.