క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సల్లో గుంటూరు వైద్యులు మరోసారి సత్తా చాటారు. ఛాతీ క్యాన్సర్‌తో బాధపడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ నుంచి.. 6 కిలోల బరువున్న కణితిని బయటకు తీశారు. విపరీతమైన నొప్పి, ఆయాసం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమెను.. గుంటూరు ఒమెగా క్యాన్సర్ ఆస్పత్రిలో బంధువులు చేర్చారు. ఇక్కడి వైద్యులు కష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
రెండేళ్ల కిందట ఆ మహిళకు మొదటిసారి కణితిని తీయగా.. రెండోసారి ఏకంగా 6 కిలోల మేర ఏర్పడింది. రొమ్ములో 27 X 24 సెం.మీ వైశాల్యంతో కణితిని నిర్థారించి.. అతికష్టం మీద తొలగించారు వైద్యులు. శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్టు డా. యంజి నాగకిషోర్ నేతృత్వం వహించగా.. డా. శౌరయ్య, ఎనస్థియాలజిస్టు, శ్రీకాంత్ బోగా, జాస్తి విజయకృష్ణ, ఎన్.వి.యస్. ప్రవీణ్‌లు పాల్గొని తమ వంతు కృషి చేశారు. రొమ్ములో ఇంత పెద్ద కణితి అభివృద్ధి చెందడాన్ని.. అత్యంత అరుదైన సంఘటనగా భావించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.