గుంటూరు జిల్లాలోని డెల్టా, పల్నాడులో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. అసలే మరమ్మతులకు నోచుకోక అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు, వరుస వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. గోతుల్లో తట్టెడు కంకర వేసి పూడ్చలేని దుస్థితి నెలకొంది. గతుకుల రోడ్లలో ప్రయాణంతో ఒళ్లు గుల్లవుతోందని.. రెండేళ్లుగా రోడ్లపై ఏర్పడిన గుంతల్లో అధికారులు గుప్పెడు కంకర వేయలేదని గ్రామీణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చోదకులు భయపడుతున్నారు.
రూపురేఖలు కోల్పోయి..
రేపల్లెలోని పెదపోస్టాఫీసు వెనుక నుంచి పాతపట్టణం అంకమ్మ చెట్టు వరకు ప్రధాన మార్గం ఛిద్రమైంది. పాతపట్టణం -పెనుమూడి, రేపల్లె -సజ్జావారిపాలెం, నిజాంపట్నం -రేపల్లె ప్రధాన రహదారులపై పలుచోట్ల గుంతలు పడ్డాయి. నిజాంపట్నం -చెరుకుపల్లి రోడ్డు, కూచినపూడి-ప్రజ్ఞం-అడవులదీవి, చెరుకుపల్లి మండలం రాజోలు-అద్దంకివారిపాలెం, నగరం నుంచి పూడివాడ, అరవపల్లి నుంచి తుమ్మలకు వెళ్లే మార్గాలు దుస్థితిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని 20 అనుసంధాన రోడ్లు రూపురేఖలు కోల్పోయాయి. పాడైన రహదారుల అభివృద్ధికి రూ.2 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, నిధులు రాగానే పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్‌అండ్‌బీ డీఈ నాగేశ్వరరావు తెలిపారు.
కుంగిపోయి.. కోతకు గురై
గుంటూరు- పొన్నూరు- బాపట్ల, గుంటూరు- తెనాలి, పొన్నూరు- చందోలు- రేపల్లె మార్గాలు అత్యంత రద్దీగా ఉంటాయి. నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జూన్ నుంచి కురుస్తున్న వానలకు ఈ రోడ్లపై తారు, మెటల్ లేచి గోతులు ఏర్పడ్డాయి. కాల్వల వెంట రహదారులు కోతకు గురయ్యాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు సత్వరమే స్పందించి మరమ్మతులు చేసి ఉంటే గోతులు పెద్దవయ్యేవి కావు. బాపట్ల- మూలపాలెం- జిల్లెళ్లమూడి, బాపట్ల- పెదనందిపాడు, బాపట్ల- పర్చూరు, జమ్ములపాలెం- నరసాయపాలెం, చింతలపూడి- పోతివారిపాలెం- గోపాపురం రహదారులు కుంగిపోయాయి. తారు లేచిపోయి మట్టి రోడ్లుగా కనిపిస్తున్నాయి. గుత్తేదారులకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించటం లేదు. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. వీటి మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మాత్రం మంజూరు కావటం లేదు.
నరకయాతన..!