ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ సంస్థలూ.. ముందుకొస్తే సౌర వెలుగులు మీ సొంతం

ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్.. వెలుగులు నింపనుంది. రూపాయి ఖర్చు లేకుండా పాతికేళ్ల పాటు తక్కువ ధరకే విద్యుత్ వినియోగించుకునే వెసులుబాటు కల్గుతోంది. ఈ సదావకాశానికి కేవలం ప్రభుత్వ సంస్థల చొరవే కీలకం కానుంది. స్థలం చూపిస్తే చాలు.... ఎన్ రెడ్ క్యాప్ ఆధ్వర్యంలో సౌర పలకలు అమర్చనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖలు ముందుకు రావాలని ఎన్ రెడ్ క్యాప్ అధికారులు కోరుతున్నారు.

Govt offices roof top solar project
Govt offices roof top solar project

By

Published : Oct 8, 2020, 7:13 PM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు పైకప్పు లేదా ఆవరణలో సౌరశక్తి యూనిట్ల ఏర్పాటుకు అనుమతిస్తే నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ.... ఎన్ రెడ్ క్యాప్ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. నిర్వహణ సైతం సంబంధిత ఏజెన్సీ చేపడుతుంది. రూపాయి ఖర్చు చేయకుండానే సౌర విద్యుత్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఫలితంగా.. విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రెస్కో పథకం అమల్లోకి తెచ్చింది. కానీ జిల్లాలోని ప్రభుత్వ సంస్థలు నామమాత్రంగా ముందుకు వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వ సంస్థలు చొరవ చూపి సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఆదాతోపాటు పర్యావరణ పరిరక్షణకు మేలు చేసినవారవుతారు.

గుంటూరు జిల్లాలో వందకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ రెడ్ క్యాప్ అన్ని శాఖలకు లేఖలు రాసింది. సంబంధిత శాఖల నుంచి ఆశించిన స్పందన లేదు. ఇప్పటివరకు సచివాలయంలో 800 కిలోవాట్ల సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర గిడ్డుంగుల సంస్థ ఆధ్వర్యంలో వంకాయలపాడులోని సుగంధ ద్రవ్యాల పార్కులో 400 కిలోవాట్ల సామర్ధ్యం గల యూనిట్ ను నిర్మించారు.

గుంటూరు నగరపాలక సంస్థలో 210 కిలోవాట్ల సామర్ధ్యం గల యూనిట్ ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు కేటగిరీ 3 కింద విద్యుత్ ఉత్పత్తి సంస్థలు యూనిట్​కు 7 రూపాయలు వసూలు చేస్తున్నాయి. అదే సౌర విద్యుత్ అయితే యూనిట్​కు 4 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. దీనివల్ల యూనిట్ కు 3 రూపాయల మేర ఆదా అవుతుంది. ఈ ఒప్పందం 25 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది.

కేవలం స్థలం చూపిస్తే చాలు.. సంబంధిత ఏజెన్సీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సంస్థలకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు రూపంలో పెద్ద ఎత్తున సొమ్ము ఆదా అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులు ముందుకు రావాలని ఎన్ రెడ్ క్యాప్ అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వ శాఖలు ముందుకొస్తే సౌరకాంతులతో కార్యాలయాలకు కొత్త వెలుగులు రానున్నాయి.

ఇదీ చదవండి:

ఐదుగురు ఐపీఎస్​లకు పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details