పులిచింతల ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పులిచింతల జలాశయానికి 4 లక్షల 45 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 12 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. వస్తున్న వరదను వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు.
పులిచింతలకు వరద ప్రవాహం...12 గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న కారణంగా... గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.
శ్రీశైలం, సాగర్ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి నుంచి వచ్చే నీరు సాయంత్రానికి పులిచింతల చేరితే.... మరికొన్ని గేట్లు ఎత్తాల్సి ఉంటుందని వివరించారు. పులిచింతల నుంచి విడుదలయ్యే వరద నీరు ప్రకాశం బ్యారేజిని చేరుతోంది. అయితే మధ్యలో కృష్ణాజిల్లాలోని మునేరు వరద కూడా కలవటంతో ప్రకాశం బ్యారేజికి ఎక్కువ వరదనీరు వెళ్తోంది. బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 43.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల