ఈ నెల 25 నుంచి రాత్రి 7 తర్వాత గుంటూరులో కర్ఫ్యూ - curfew in Guntur City news
19:54 April 20
గుంటూరులో ఎల్లుండి నుంచి వ్యాపార వేళలపై ఆంక్షలు ఉండనున్నాయి. దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రాత్రి 7గంటల తర్వాత గుంటూరులో కర్ఫ్యూ ఉండనుంది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల దుకాణాలపై ఆంక్షలుండవు. మాస్కులు తప్పనిసరిగా ధరించడంపై పోలీసులు నిరంతర తనిఖీలు చేయనున్నారు.
గుంటూరు నగరంలో ఈనెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. కరోనా నియంత్రణ చర్యలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మేయర్ కావటి మనోహరనాయుడు, నగర ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అనురాధ, ఆర్డీవో భాస్కరరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో గుంటూరులోనే సగానికిపైగా ఉండటంతో కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. నగరంలో వ్యాపార సంస్థలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే తెరవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయాల్లో అనవసరంగా తిరిగే వారిని కట్టడి చేసేందుకు 25వ తేదీ నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు వివరించారు. రాత్రి 7 గంటల తర్వాత నగరంలో కర్ఫ్యూ ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని మేయర్ సూచించారు. ఆసుపత్రులు, మందుల షాపులు, పాల దుకాణాలపై ఆంక్షలు లేవని చెప్పారు. ప్రజలు బయటకు వచ్చేటపుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. దీనిపై తనిఖీలు కొనసాగిస్తామని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ... అత్మాహత్యాయత్నం.. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు..క్షేమంగా తల్లి