ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 9:25 AM IST

Updated : Dec 8, 2020, 8:34 PM IST

ETV Bharat / city

గుంటూరులో ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్

భారత్ బంద్​లో భాగంగా.. గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా.. వామపక్షాలు, కాంగ్రెస్​తో పాటు వివిధ రైతు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాలు నిర్వహించారు. ఆర్డీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా.. కార్యాలయాలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి.. బంద్​కు మద్దతు తెలిపారు.

guntur bund
గుంటూరు జిల్లాలో భారత్ బంద్

గుంటూరులో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా తెదేపా, కాంగ్రెస్, వామపక్షాలతో పాటు వివిధ రైతు, ప్రజాసంఘాల ప్రతినిధులు.. జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నూతన వ్యవసాయ బిల్లులను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. వీటి వల్ల రైతు ఉనికి ప్రశ్నార్థకంగా మారడమే కాక.. వ్యవసాయరంగం బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతుందని సీపీఐ నేత కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని 1,200కు పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మిగతా ప్రైవేటు బస్సులు, ఆటోలను నిరసనకారులు అడ్డుకోగా.. ప్రజారవాణా స్తంభించింది. కార్యాలయాలు, విద్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించగా.. హింసాత్మక చర్యలకు ఆస్కారం లేకుండా పోలీసులు పహారా నిర్వహించారు.

గుంటూరులో భారత్ బంద్

అమరావతి రైతుల మద్దతు:

భారత్ బంద్​కు అమరావతి రైతులు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ.. వెలగపూడి కూడలిలో మానవహారంగా ఏర్పడి జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదా అంటూ ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. మందడంలో వామపక్షాలతో కలిసి అన్నదాతలు ఆందోళన చేశారు. దిల్లీలో రైతుల నిరసనకు సంఘీభావం తెలుపుతూ.. రాజధాని ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు.

చిలకలూరిపేటలో..

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్​కు మద్దతుగా తెదేపా, సీపీఐ, సీపీఎం నేతలు.. రైతు సంఘాలతో కలిసి చిలకలూరిపేటలో నిరసన చేపట్టారు. పలుచోట్ల ర్యాలీ నిర్వహించిన నాయకులు.. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, పాఠశాలలను మూయించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తాడికొండలో..

రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మల్కాపురం కూడలిలో రాస్తారోకో నిర్వహించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం వైపు వెళ్లే యత్నాన్ని పోలీసులు అడ్డుకోగా.. రహదారి పైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు.

ఇతర ప్రాంతాల్లోనూ..

నరసరావుపేట, వినుకొండ, పెదకాకాని, పిడుగురాళ్లలో అఖిలపక్షం నేతలు.. భారత్ బంద్​కు మద్దతుగా తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. రైతుల కష్టాన్ని కార్పొరేట్పరం చేసే చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రధాన రహదారులపై పలుచోట్ల ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల రైతులు పది రోజులుగా దేశ రాజధానిలో నిరసన చేపడుతుంటే.. ప్రభుత్వం స్పందించకపోవడంపై మండిపడ్డారు.

ఇదీ చదవండి:

రైతు కోసం కదిలిన భారతం- బంద్​ ప్రశాంతం

Last Updated : Dec 8, 2020, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details