ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ఆశలను వమ్ము చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గుంటూరులో మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయితే (CM JAGAN) తమ కష్టాలు తీరిపోతాయని నమ్మి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఓట్లు వేశారన్నారు. కానీ.. సీఎం జగన్ వారందరినీ మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై జులై 2 న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉద్యోగాల కల్పన పేరిట వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఆర్బాటం వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీలేదని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ అన్నారు. విచ్చలవిడిగా ప్రజలపై పన్నులు భారం వేస్తూ సీఎం జగన్.. బ్రిటిష్ కాలం నాటి పాలనను గుర్తు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీసీలకు ప్రత్యేక కార్పోరేషన్లు పెట్టి.. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన ఇలాగే కొనసాగితే ప్రజలంతా రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.