జాతీయస్థాయి కంటే రాష్ట్రంలో ఎస్సీలపై నేరాల రేటు అధికంగా ఉందని జాతీయ నేర గణాంక సంస్థ తెలిపింది. ఈ మేరకు 2019 ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికలో వివిధ అంశాలను వెల్లడించింది. ఎస్సీలపై జరిగిన నేరాల్లో 4.5 శాతం ఏపీలోనే ఉన్నట్లు చెప్పిన సంస్థ రాష్ట్రం ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఈ ఒక్క విభాగంలోనే కాకుండా ఆర్థిక, సైబర్ నేరాలు, వృద్ధులు, మహిళలపై నేరాల్లోనూ అంతకు ముందేడాది కంటే గతేడాది గణనీయ వృద్ధి ఉందని నివేదికలో వివరించింది. చిన్నారులపై నేరాలు స్వల్పంగా తగ్గాయన్న సంస్థ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు మాత్రం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయని స్పష్టం చేసింది. మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ఐపీసీ, స్థానిక ప్రత్యేక చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం అన్నిరకాల నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 2019లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2018 కంటే 1.16శాతం మేర పెరిగినట్లు నివేదికలో పేర్కొంది.
మహిళలపై దాడులు.. ఏపీలో 29.31 శాతం
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని ఎన్సీఆర్బీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు 6వేల 454 చోటుచేసుకోగా అందులో 1,892 అంటే 29.31 శాతం ఏపీలోనే జరిగాయని వెల్లడించింది. ప్రతి లక్ష మంది మహిళలకు 7.2 నేరాలు జరుగుతున్నట్లు వివరించింది. పనిప్రదేశాల్లో, ప్రజారవాణాలో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలో తెలిపింది. ఎస్సీలపై నేరాలకు సంబంధించి 2018లో 1,836 కేసులు నమోదుకాగా 2019లో ఆ సంఖ్య 2,071కు చేరిందని 12.79శాతం మేర పెరుగుదల నమోదైందని పేర్కొంది. ఏపీలో 84.5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉండగా లక్ష మంది జనాభాకు 24.5 నేరాలు జరిగినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష మంది ఎస్సీ జనాభాకు 22.8 నేరాలు జరిగాయంది. 2017తో పోలిస్తే 2018లో ఏపీలో ఎస్సీలపై నేరాలు 1,969 నుంచి 1,836కు అంటే 6.7శాం తగ్గాయని....2018 కంటే 2019లో పెరిగాయని స్పష్టం చేసింది. ఎస్టీలపై నేరాల్లో మాత్రం అంతకు ముందేడాదితో పోలిస్తే గతేడాది పెరుగుదల, తగ్గుదల రెండూ లేదని తెలిపింది.