Heavy Rains in Hyderabad: హైదరాబాద్ వాసిని చినుకు వణికిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీ, నారాయణగూడ దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాంపల్లి ఏరియాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగి ప్రభావిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారంబాగ్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహించి.. గోల్నాక వైపు కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మలక్ పేట వంతెన కింద భారీగా వర్షపు నీటితో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని అనేక కాలనీలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్‌నగర్ చెరువుకు దిగువన ఉన్న కోదండరాంనగర్, సీసల బస్తీ, పీ అండ్ టీ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కాలనీల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటికి రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్ నగర్ చెరువు ఈ కాలనీలను ముంచెత్తగా.... మళ్లీ వానలతో ఎప్పుడేం జరుగుతోందనని కాలనీల వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.