'మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ప్రమాణం' - take_charge
మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాక స్పందించడం కంటే... అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్ , నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, గుమ్మనూరి జయరాం, తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సహా ఇతర నేతల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత... పద్మతో ప్రమాణస్వీకారం చేయించారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో... అన్ని రంగాల్లో మార్పులు రాబోతున్నాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా కమిషన్ పదవికి జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయని, మహిళా హక్కుల పరిరక్షణకు వాటిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తోందని మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత అన్నారు. గతంలో మహిళా కమిషన్ నిస్తేజంగా ఉందని ఎపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ఇకపై రాష్ట్రంలో మహిళలందరికీ మంచి రోజులు రానున్నాయని వాసిరెడ్డి పద్మ తెలిపారు.