రాజద్రోహం చట్టం దుర్వినియోగంపై సుప్రీం కోర్టులో చర్చ జరగడం.. శుభ పరిణామమని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారిని పాలకులు ఫ్యాక్షనిస్టుల్లా వేధిస్తుంటే.. న్యాయస్థానాలే రక్షణగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలే కానీ న్యాయస్థానం వెళ్తే తప్ప ప్రజలకు న్యాయం జరగటం లేదని రఘురామ అన్నారు. ఎంపీ విజయసాయిపై.. తీరును రఘరామ తప్పుబట్టారు. తన స్థాయి గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు.
"ఒకటి చెప్పి మరొకటి చేసే మనస్తత్వం నాది కాదు. అలాంటి ప్రవర్తన ఎవరికీ నచ్చదు. ఎవరిది ఏ కులం, ఏ వంశం అనే అంశంపై చర్చకు సిద్ధం. పది మందికి తెలిసిన అంశాలను మళ్లీ ప్రస్తావిస్తున్నా. లేని స్థాయి పెంచుకుంటే అది రాదని మీరు గుర్తించాలి. స్థాయి, ప్రవర్తన గురించి తక్కువగా మాట్లాడితే మీకే మంచిది" అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి రఘరామ వ్యాఖ్యానించారు.