bifurcation act of andhra pradesh: ‘విభజన చట్టంలోని హామీల అమలుకు రెండేళ్ల సమయమే మిగిలింది. నెరవేర్చాల్సినవి చాలానే ఉన్నాయి. ఈ సందర్భంగా ఓ కథ చెబుతా. ఒక రాజ్యానికి మేలుచేయాలనుకున్న రాజు తన చుట్టూ ఉన్న మేధావులను పిలిచించారు. తమ వంతుగా సాయం చేయాలని కోరారు. మేం బ్రహ్మాండమైన పులి బొమ్మను గీయిస్తాం.. తద్వారా సమస్యలను అధిగమించవచ్చు.. అది గొప్ప విలువైన ఆస్తి కూడా అవుతుందని మేధావులు చెప్పారు. వారిలో ఒక మేధావి.. తోక ఎక్కువ పొడవు ఉండకూడదు, తగ్గించాలని చెప్పారు. చారలు ఎక్కువ గీయొద్దని మరో మేధావి సూచించారు. చెవులు తగ్గించాలని మరొకరు... పంజా పెద్దగా ఉంది తక్కువగా ఉండాలని చెప్పి ఇంకొకరు... ఇలా తమకు తోచిన సలహాలతో పులిబొమ్మలను గీయించారు. అంతిమంగా పులి బొమ్మ కాస్తా పిల్లిలా రూపాంతరం చెందింది. విభజన హామీల అమలుపై ప్రస్తుత వైఖరి గురించి చెప్పడానికే నేను ఈ కథను ఉదహరించాను’ అని వైకాపా లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో బడ్జెట్ అనుబంధ పద్దులపై ఆయన మంగళవారం జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను వివరించారు.
‘ఆంధ్రప్రాంత ప్రజలు కోరుకోనప్పటికీ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయి. విభిన్న వాగ్దానాలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. విభజన చేసిన రోజు రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణకు రూ.15,454 ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,979 ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. అందుకే పార్లమెంటు లోపల, బయట రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించారు. కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండాలి. ప్రత్యేక హోదా ఇవ్వడం మినహా మరో గత్యంతరం లేదు. విభజన చట్టం హామీల అమలుకు రెండేళ్లే మిగిలింది. ఈ సమయంలోనూ బాధ్యతా రాహిత్యమైన సమాధానాలేమిటో అర్థం కావడంలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సమస్యలున్నాయంటూ నిధులు ఆపేశారు. పోలవరం ఏపీ ప్రజల జీవనరేఖ. రూ.56 వేల కోట్ల సవరించిన అంచనాలను కేబినెట్‌కు పంపి ఆమోదిస్తే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతుంది. బుందేల్‌ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాల గ్రాంట్ ఇస్తామని చెప్పి... పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.