రైతులకు ఉచిత బోర్ల కోసం ఉద్దేశించిన 'వైఎస్ఆర్ జలకళ' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రారంభించిన ఆయన... రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశామని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 144 రూరల్ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్‌లలో ఈ పథకాన్ని మొదలుపెడుతున్నామని వివరించారు. నియోజకవర్గంలో ఒకటి చొప్పున బోర్ వేసే యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.... రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తామని వెల్లడించారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఉచితంగా బోర్లు వేయించడంతో పాటు మోటార్లు కూడా బిగిస్తామని స్పష్టం చేశారు.
'ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బోర్ రిగ్గును ఏర్పాటు చేశాం. వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లోనూ బోర్ తవ్వించేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్ వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు మొదటి బోర్ వేశాక విఫలమైతే.. రెండోసారి కూడా అదే రైతుకు బోర్ వేయాలని ఆదేశించాం'- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి